పండితులైనవారు దిగువం దగనుండగ,
నల్పు డొక్కడు
ద్ధండత బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి
యెగ్గగున్;
కొండొక కోతి జెట్టు కొనకొమ్మల నుండగ,
గ్రింద గండ భే
రుండ మదేభ సింహ నికురంబములుండవె
చేరి భాస్కరా!
జ్ఞానులైనవారు అనగా పండితులు తక్కువ స్థానంలో ఉన్నా, అజ్ఞాని అనగా జ్ఞానశూన్యుడు లేదా అల్పస్వభావుడు గర్వంతో ఉన్నత స్థానంలో కూర్చున్నా, పండితుల విలువ తగ్గదు. ఒక చిన్న కోతి చెట్టు చివర కొమ్మల మీద కూర్చుంటే, ఆ చెట్టు కింద గండభేరుండ పక్షులు, మదించిన ఏనుగులు, సింహాలు ఉన్నట్లన్నమాట. ఉన్నతమైనవారు కింద ఉన్నా, అల్పులు పైన ఉన్నా.. వారి స్వభావాలు, విలువలు మారవని భాస్కర శతకకారుడు మారద వెంకయ్య చెబుతున్నారు.
అనగనగా అవంతిక అనే పేరు గల ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ప్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయన తాను మహారాజుననే గర్వంతో విర్రవీగేవాడు. తన దగ్గర ఉండే మంత్రులను, ప్రధానులను, పండితులను, విద్వాంసులను.. అందరినీ చులకనగా చూసేవాడు. వారికి తగిన గౌరవం కూడా ఇచ్చేవాడు కాదు. కాని వారంతా మహారాజు అహంకారాన్ని లెక్కచేయకుండా తమతమ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
సభాభవనంలో కూడా వారికి తగిన ఆసనాలు వేయకుండా, అవమానకరంగా చూసేవాడు. అయినప్పటికీ వారు మాత్రం దేశ క్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అన్ని అవమానాలను భరించేవారు. ఇలా ఉండగా ఒకనాడు పొరుగు రాజ్యం వారు అకస్మాత్తుగా అవంతిక రాజ్యం మీదకు దండెత్తి వచ్చారు. ఈ ఆకస్మిక పరిణామానికి రాజు బెంబేలెత్తిపోయాడు. ఏం చేయాలో తోచలేదు.
మంత్రులను, ప్రధానులను అత్యవసరంగా సమావేశపరిచాడు. వారంతా వినయంగా చేతులు జోడించి ప్రభువు ముందు నిలబడి, విపత్తు నుండి బయటపడే మార్గం సూచించారు. వారి సహకారంతో ప్రసేనుడు శత్రువులను ఓడించి, విజయం సాధించాడు. ఆ రోజు వరకు తాను ప్రవర్తించిన తీరుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. ‘ఓ మహానుభావులారా! మీ వంటి జ్ఞానులు ఎక్కడ ఉన్నా మీ విలువ తగ్గదు. నేను ఎంత అవమానించినా మీ సుగుణ స్వభావము మారలేదు.
ఇంతకాలం నేను అజ్ఞానంతో, అహంకారంతో అల్పుని వలె ప్రవర్తించాను. మీరు పెద్ద మనసుతో నా పట్ల సహృదయతతో ప్రవర్తించి, నాకు విజయం చేకూర్చారు. మీ మేలు ఈ జన్మలో మరచిపోలేను. నేటి నుంచి నా ప్రవర్తనను మార్చుకుంటున్నాను. చెట్టు పైన కోతి వలె విర్రవీగాను. మీరు మాత్రం చెట్టు క్రింద కూర్చున్న గండభేరుండ పక్షుల వలె, మత్తేభసింహాల వలె ఉన్నారు. మీ సత్ప్రవర్తన కారణంగా నా తప్పు నేను తెలుసుకోగలిగాను’ అని పలికాడు.
మహాభారతంలో..
శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన రాయబారిగా కౌరవ సభకు వచ్చాడు. కురు వృద్ధులైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునికి గౌరవపూర్వకంగా స్వాగతం పలికారు. గురు వృద్ధుడైన ద్రోణాచార్యుడు సైతం శ్రీకృష్ణుని పట్ల గౌరవసూచకంగా నిలబడి, నమస్కరించాడు. అదే సభలో ఉన్న దుర్యోధనుడు మాత్రం అహంకారంతో సభా మర్యాద కూడా లేకుండా, ధుమధుమలాడుతూ త్రాచు బుసకొడుతున్నట్లు ఊపిరి విడుస్తూ వెళ్లిపోయాడు.
అది చూసి భీష్ముడు, ‘ఈ దుష్టుడు కోపావేశానికి లోనై, ఆపదలు తల మీదకు తెచ్చుకుంటున్నాడు’ అన్నాడు. శ్రీకృష్ణుడు, ‘మహారాజా! మీరు సింహాసనం ఎక్కి కూడా ఇంతటి మూర్ఖుడిని సక్రమంగా నడపలేకపోతున్నారు. మీరు, గురువులు, కురువృద్ధులు ఉండగా సభ వీడి వెళ్లరాదనే పరిజ్ఞానం కూడా లేని ఈ మూఢునికి తగిన బుద్ధి చెప్పాలి. కురువంశ రక్షణార్థం ఈ ఒక్కడిని వదులుకోండి. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణులను బంధించి పాండవుల అధీనంలో ఉంచండి. ఇంతకంటే మీకు శ్రేయోమార్గం లేదు’ అని హితవు పలికాడు.
మహానుభావులు, వంశ పెద్దలు... ఇంతమంది సభలో ఉండగా అహంకరించి ప్రవర్తించాడు దుర్యోధనుడు. అంతమాత్రాన ఆ పెద్దల స్వభావం, వారి విలువ ఏమాత్రం తగ్గలేదు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని పట్ల ప్రవర్తించిన తీరు చూసిన ప్రజలంతా దుర్యోధనుడిని ఏవగించుకున్నారు. శ్రీకృష్ణుని ఔన్నత్యాన్ని కొనియాడారు.రాజవీధిలో ఏనుగు నడుస్తుంటే.. దాని వెనుకే కుక్కలు మొరుగుతుంటాయి. అంతమాత్రాన ఏనుగు విలువ ఏమాత్రం తగ్గదనే విషయం తెలిసినదే. అందుకే వినయవిధేయతలతో జీవించాలని పెద్దలు చెబుతారు.
- డా. పురాణపండ వైజయంతి–
